చిత్రం:మానవుడు-దానవుడు
పాడిన వారు:యస్.పి.బాల సుబ్రహ్మణ్యం
రచన:సీ.నారయణ రెడ్డి
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై నడిపించ రావా
మనిషే మనిషే కరిచే వేళా
ద్వేషము విషమై కురిసే వేళా
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలు చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించగ రావా
అణువు అణువున!!
జాతికి గ్రహణం పట్టిన వేళా
మాతృభూమి మొరుపెక్కిన వేళా
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించగ రావా
అణువు అణువున!!
వ్యాధులు బాధలు ముసిరే వేళా
మృత్యువు కోరలు సాచే వేళా
గుండెకు బదులుగ గుండెను పుదిగి
కొన ఊపిరులకు ఊపిరులు ఊది
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవా గుణం మాకందించ రావా
ఓ ప్రభూ!ఈ ప్రపంచమంతటా నీవు వ్యాపించి వున్నావు.సర్వాంతర్యామివి.మా అందరిలో ప్రాణానికి ప్రాణమై ఉన్నావు.మా ఊనికికి కారణభూతమై ఉన్నావు.అటువంటి నిన్ను వెఱ్ఱి వెఱ్ఱి ఆలోచనలలో మునిగి,అర్ధం పర్ధం లేని పనులలో మమ్ములను మేము తీరుబడి లేకుండా చేసుకుని నిన్ను హృదయంలో కనిపించీ కనిపించని చోటులో దాచేసి ఆ విషయం మరిచిపోయి మేము ఙ్ఙానాంధులము అయిపోయాము.మా జీవనాధరమైన నీ అస్తిత్వమును మరుగుపరిచిన కారణంగా నేడు ఏ తోడూ లేకుండా తిరిగే అంధుని వలే అనేక ఇక్కట్లు పడుతున్నాము.ఇప్పటి వరకు మేము చేసిన తప్పులను క్షమించి, మమ్ములను మన్నించి మాపై దయ చూపి మా కనులకు వెలుగై మమ్ములను నడిపించగ రావా తండ్రీ!
ఓ ప్రభూ!కంటికి జబ్బు చేసినప్పుడు జ్యోతి ఎలా సరిగ్గా కనపడదో అలా మా మనస్సులకు స్వార్ధం అనే జబ్బు చేసింది.ఎంత తీవ్ర స్థాయిలో ఆ రోగం ముదిరి పోయిందంటే మా అస్తిత్వమునకు కారణమైన నిన్ను మరిచిపోయి నీ ఊనికినే ప్రశ్నిస్తోంది నేడు.మమ్ములను గన్న మా తండ్రీ!ఎప్పుడైతే నీ ఊనికిని ప్రశ్నించటం మొదలు అయ్యిందో అప్పుడే మనిషి తనను అతః పాతాళానికి తీసుకు వెళ్ళే దారులలో పయనించటం మొదలు పెట్టాడు.ధనం,బంగారం,ఇతరత్రా కోరికలను తీరుచుకోవడం కోసం నైతీక విలువలను వదిలి మరింత పతనమవుతున్నాడు ప్రభూ! మనిషిని మనిషే హత్య చేస్తున్నాడు.నీ పేరు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు,హింసను ప్రోత్సహిస్తునాడు.ప్రభుత్వాలను పడగోట్టి దేశముల మధ్య వైరమును సృష్టించి ప్రపంచాన్నంతటినీ మింగజూస్తూన్నాడు.శాంతికి భంగం కలిగిస్తున్నాడు. జగమంతటా ద్వేషమనే నిప్పుల వర్షం కురుస్తోంది.
ఓ ప్రభూ! ఆనాడు పరమ శివుడివై హాలాహలమును మ్రింగి లోకాలన్నింటిని రక్షించావు.ఆ తరువాత శ్రీహరివై దుష్టులైన దానవులను శిక్షించి దేవతలకు అమృతాన్ని ప్రసాదించావు.నీ లీలను అర్ధంచేసుకునే కదా ఆనాడు ప్రపంచానికి సత్యాన్ని అందించాలన్న ప్రయత్నంలో నిప్పులాంటి విషాన్ని మ్రింగి ఆమరజీవైనాడు సాక్రటెస్…మనుష్యులకు మానవత్వం ,నిస్వార్ధమైన ప్రేమ అనే అమృత గుణాలను అందించే ప్రయత్నంలో తమ జీవితాలను,ప్రాణాలను త్యాగం చేసి అమరజీవులై,మా కనులకు వెలుగును అందింప జేసిన వారు (జీసస్ క్రీస్తు,గౌతమ బుద్ధుడు) ఎందరో … ఆలాంటి మహానుభావులందరి అమృత గుణం మాకందించగా రావా ప్రభూ!
ఓ ప్రభూ!కొన్ని వందల సంవత్సరాలు బ్రిటీషు పాలనలో వున్న భారత దేశం తన సంపదలను కోల్పోవడమే కాకుండా తన ప్రజల రుధిరంతో ఎర్రబడినది.మహత్మా గాంధీ,అల్లూరి సీతారామరాజు,ఝాన్సీ లక్ష్మీ భాయి,నేతాజీ సుభాష్ చంద్ర బోస్,భగత్ సింగ్,సర్దార్ వల్లభాయి పటేల్,బాల గంగాధర్ తిలక్,అంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి వారు ఎందరో మహానుభావులు స్వరాజ్య సమరం సాగించి,స్వాతంత్ర ఫలమును సాధించి మాకు అందించారు.దేశ మాత కోసం ,తోటి ప్రజల కోసం తమ జీవితాలను,ప్రాణాలను త్యాగం చేసి ధన్యజీవులైనారు. అటువంటి ధన్య జీవుల త్యాగ నిరతిని మాకు అందించగ రావా తండ్రీ!
ఓ ప్రభూ!అఙ్ఙానం,ఛాందసవాదం,స్వార్ధం,పేదరికం వంటి కారణాలెన్నో మా మనస్సులను,జీవితాలను చీకటిమయం చేసాయి.అందుకే ధనవంతులు మరింత ఐశ్వర్యవంతులుగా ఎదుగుతున్నరు,పేదలు మరింత నిరుపేదలవుతున్నారు.వైద్య సదుపాయం లేకపోవడంతో వ్యాధులు చాప క్రింది నీరులా ప్రాణాలను హరిస్తున్నవేళ,పేదరికం పరిహాసం చేస్తున్న వేళ,మా మనస్సులలో అణగారిపోయిన ఆశలను చిగురింప జేసి,ప్రేమతో సరి అయిన వైద్య సేవలను అందించి, మా ప్రాణాలను నిలబెట్టి, జీవన దాతలై వెలిగిన మదర్ థెరీసా వంటి ఎందరో అమృత స్వరూపుల సేవా గుణం మాకందించగ రావా తండ్రీ!