చిత్రం: ఇద్దరు అమ్మయిలు
పాడినవారు:పీ.సుశీల
ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి…అనురాగం పండాలి …
పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా ఈ పచ్చని ముంగిట కురవాలి
శుభములొసగే మందిరము శాంతికి నిలయము కావాలి
లక్ష్మీ సరస్వతి పొందికగా ఈ ఇంటను కాపురము వుండాలి.
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో మీ వాకిలి కళకళలాడాలి
నాకు ఈ పాట సాహిత్య పరంగాను,సంగీత పరంగాను చాలా ఇష్టము.సినిమాలో నూతన గృహ ప్రవేశం సందర్భంలో కథా నాయిక పాడిన పాట.ఈ పాట సాహిత్య పరంగా చాల సరళముగా అనిపించినా భావ పరంగా కొంచెం క్లిష్టమైనదిగా అనిపించింది ఎందుకంటే ఆచరణలో అది కష్టము అని భావిస్తున్నాను.
;
మొట్ట మొదటి వాక్యం “ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో” అని విన్నప్పుడు చల్లని చిరుగాలి సున్నితంగా మనస్సును తాకి వెళ్ళిన అనుభూతి కలిగింది.ఎందుకంటే చల్లని లోగిలి అంటే ఇల్లంతా ఏసీచే చేయించబడినదై,గోడలు- పై కప్పు ఖరీదయిన రంగులతోను,ఇతర వస్తువులతో నింపబడిన భావన నాకు కలుగ లేదు కాని స్ఫురించిన విషయము అతిధి దేవోభవ అన్న ఆర్యోక్తి.అతిధి రూపంలో వున్న భగవంతుడు ప్రసన్నుడు అయిన నాడు మన ఇల్లే దేవాలయం అవుతుంది.అతిధి సంతృప్తి పడేది ఎప్పుడు అన్న ప్రశ్నకు సమధానం పెద్దలే చెప్పారు మనకు.ఎప్పుడైతే ఇంటి యజమాని,ఇల్లాలు,ఇతర కుటుంబ సభ్యులందరూ తమ తమ ధర్మాలను పాటిస్తూ,తమ తమ మృదు మధుర వచనాలతో ఇంటికి వచ్చిన అతిధిని సంతోష పరుస్తారో అప్పుడు ఆయన ప్రీతి చెందిన హృదయంతో మీరందరు పిల్లా పాపలతో చల్లగా వుండి వర్ధిల్లాలని,ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి పొందాలని,సుఖ సంతోషాలతో వుండాలని ఆశీర్వదిస్తాడు.ఆలా మన గృహమునకు వచ్చిన అతిధి మన అభివృద్ధిని కోరుకున్ననాడు మన ఇంట్లో శక్తితో కూడిన పరమేశ్వరుడు నివసించడం ప్రారంభిస్తాడు.పర్వతీ సమేతుడైన శివుడు మన ఇంట్లో వుండటం వల్ల మన గృహము చల్లని లోగిలి కలిగిన బంగారు కోవెల అవుతుంది.ఎప్పుడైతే శివపార్వతులు మన ఇంట్లో కొలువై వుంటారో ఆనాడే మన ఇల్లు ఆనందనిలయముగా మారి భార్య భర్తల మధ్య నున్న అనురాగం పండుతుంది.కుటుంబ సభ్యుల మధ్య నున్న మమతలు,ఆప్యాయతలు పెనవేసుకున్నప్పుడు ఆ కుటుంబము నలుగురికీ ఆదర్శప్రాయమవుంది.

పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి
ఇక్కడ ఈ వాక్యం వింటున్నప్పుడు నాకెందుకో గోకులములోని గోపాల కృష్ణుడే గుర్తుకు వచ్చాడు…నంద నందుని అల్లరి..తోటిపిల్లలతో కలిసి ఆయన చేసిన లీలలూ అంతా గుర్తుకు వచ్చాయి.మనమేంతో పుణ్యం చేసి వుండాలి అందుకే శ్రీకృష్ణుడు పిల్లల పాపల అల్లరితో మన ఇంటిని నింపి మన గృహమును తాను నివసించడానికి వీలుగా వుండేటటువంటి గోకులము,బృందావనముగా మార్చి తాను కొలువై వున్నాడని నాకు అనిపించింది..భార్యాభర్తల గొడవలు గానీ లేక ఇతర పెద్దల చికాకులు లేని ఇల్లు పిల్లలకు స్వర్గమే కదా.. తల్లితండ్రుల ప్రేమాభిమానాలు పుష్కలంగా వుండీ,తాతయ్యల,బామ్మ అమ్మమ్మల మమతానురాగాలు నిండుగా వున్న ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలు సంస్కారవంతులుగా,మంచి పౌరులుగా పెరుగుతూ వుంటారు కదా .. అటువంటి పిల్లల ఆట పాటలతో అల్లరితో విలసిల్లే ఇల్లు బృందావనమే అవుతుంది…ఏ ఇంట్లో పిల్లలు సంతోషంగా వుండి,శారీరికంగా,మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతూ వుంటారో అక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామా సహితుడై,తన తల్లి తండ్రులతోటి,గోపికలు గోపాలకులతోటి ఆ ఇంట కొలువై ఉండి సర్వదా రక్షిస్తూ వుంటాడు కదా…

అమ్మలను గన్న అమ్మ,ముజ్జగాలకు మూలపుటమ్మ,స్త్రీలకు సకల శుభములను,సౌభాగ్యములను ఇచ్చి రక్షించే పెద ముత్తైదువు,నిత్య సుమంగళి,సర్వ మంగళ మన అమ్మ గౌరమ్మ సంతోషిస్తేనే కదా పసుపు కుంకుమలు నిత్యమూ మన ఇంట వుంటాయి.మరి అమ్మ పార్వతీ దేవి సంతోషించాంటే మనం ఏమి చేయాలి? ఏ ఇంట అయితే భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకుని సీతారాముల్లా అన్యోన్యంగా వుంటారో,ఏ ఇంట అయితే అక్కా చెల్లెళ్ళు-అన్న దమ్ములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లా కలిసి మెలిసి ఆనందంగా వుంటారో,ఏ కుటుంబమైతే శివ కుటుంబంలా కలిసి కట్టుగా తాము సంతోషంగా వుంటూ తమకున్న భాగ్యాన్ని నలుగురితో కలిసి పంచుకుంటారో,ఏ కుటుంబమైతే పదుగురికీ సహాయం చేస్తుందో,ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని చూచి అమ్మ మనసు పరవశిస్తుంది.ఎప్పుడైతే జగన్మాత సంతోషిస్తుందో అప్పుడు బంగారం వంటి మనస్సులనే లోగిళ్ళు కలిగిన ఇంట పసుపు కుంకుమలను కొల్లలుగా కురపిస్తుంది. అలా ఆది దంపతుల కరుణా స్రవంతి నిత్యమూ మనపై జాలువారుతున్నప్పుడు మన ఇల్లు శుభములనోసగే మందిరమై శాంతికి నిలయము అవుతుంది.

ఏ ఇంటిని చూచి ఉమ దేవి సంతోషించి పసుపు కుంకుమలను కురిపించి సకల శుభములను కలిగించి సదా శివుని కృప మనకు లభించేలా చేస్తుందో,ఆ ఇంటిని చూచి పరమానందమును చెందిన శ్రీమహాలక్ష్మి సకల సంపదలను, ఆయురారోగ్యాఇశ్వర్యములను ప్రసాదించి శ్రీమన్నారాయణుని కరుణ ప్రసరించేలా ఆశీర్వదిస్తుంది.అలాగే సకల కళలకు మూల శక్తి,ఙ్ఙాన స్వరూపిణీ అయిన సరస్వతి దేవి సంతోషించి మనకు ఙ్ఙానాన్ని కాటక్షించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అనుగ్రహం మనకు లభింపజేస్తుంది.
ఎప్పుడైతే మన ఇల్లు సకల దేవతలకు నివాస స్థానము అవుతుందో ఆ ఇల్లే దేవాలయము అవుతుంది.. ఆ ఇంటి ఇల్లాలే త్రిగుణాత్మకమైన ఆన్నపూర్ణా దేవిగా ఎల్లరి మనములకు సుఖ శాంతులను ప్రసాదిస్తుంది.తమ తమ ధర్మాలను తాము నిర్వహిస్తూ,దేవతల అనుగ్రహానికి ఏ కుటుంబ సభ్యులైతే పాత్రులవుతారో ఆ ఇల్లు ఎల్లప్పుడు వచ్చే పోయే అతిధులతో,ప్రతీ రోజు ఒక పండుగగా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణం గా వుంటుంది.