లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నులలలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిని
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
ఈ పాట విన్నప్పుడల్లా మాటల కందని మధురానుభూతి మౌనాన్ని తోడుగా తీసుకుని హృదయాంతరాళల్లో ఆహ్లదతనే గంధాన్ని పూసి సేదతీరుస్తుంది అని నా నమ్మకం. సినీ సాహితీ వనంలో ఒక చందన వృక్షమని వంటిదయిన ఈ పాట నాయికా నాయకుల మధ్య అనురాగానికి చిహ్నంగా సాగే గీతమైనా,మన మనస్సుల్లో ఒక పవిత్ర భావన ఉదయిస్తుంది ఎందుకంటే హృదయాలను రంజింపజేసే స్వర మధురిమ,సాహిత్యపు సిరులు అంత పుష్కలంగా వున్నాయి కాబట్టి.ఒక మనస్సులో చిగురించిన మమకారం కన్నుల కొలనులో వికసించిన లలిత ప్రియ కమలమైనది.అదే ప్రియ కమలమైన అనురాగం మరొకరి ఊహల జగత్తును మేల్కోల్పిన రవికిరణమై హృదయాన్ని తాకినది.ఇలా మన ఇరువురి మనస్సులో జనించిన అనురాగం అమృత కలశమై మన జీవితాలను స్వర్గమయంగా మార్చి మనలను ఏకంగా ఆనందపుటంచులకు జేర్చినది.మనము అనుభవిస్తున్న ఈ ఆనందం మనకు దొరికిన అరుదైన వరం.ఈ వరం బాహ్య ప్రపంచానికి అర్ధము,లభ్యం కానివని పాడుకుంటున్నారు నాయికా నాయకులు.
రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేలా నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
ఆహా!తమ ప్రేమకు ప్రకృతి వర్ణాన్ని అద్దుతున్నరు ఇక్కడ.పగలు రాత్రి కానీ సమయం సంధ్యా సమయం:చైతన్యమాయమైన సమయం.హృదయానికి,బుద్ధికి,తనువుకు ఉత్సాహాన్ని,ఉల్లాసాన్ని,స్వచ్ఛతను ఇచ్చే సమయం.అందుకే చిన్నపిల్లలకు ఉదయ సంధ్యలో చదువుకొమ్మంటారు,సాయం సంధ్యలో ఆడుకొమ్మంటారు.అలాగే దైవప్రార్ధనలను సంధ్యా సమయాలలో చెయ్యమంటారు.సంధ్యా సమయం అంతటి పవిత్రము,స్వచ్ఛము,ఉల్లాసాభరితమైనది మన ప్రణయం అని..భూమి ఆకాశాలను ఇంద్రధనస్సు ఎలా కలుపుతుందో అలా మన మనస్సులను కలిపి అనురాగబంధాన్ని పెనవేసింది మన స్నేహం అంటూ తమ చెలిమిలొనీ నిర్మలత్వం ,మమతలోని నిష్కల్మషం గురించి ఒకరికొకరు చెప్పుకుంటున్న తీరు అత్యంత రమణీయం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళీ రాగ చరితర గలమృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
నా కోరికలనే కోవెల ద్వారానికి దేవతవై నీవై చెరుకోగా,ఆ కోవెలలో నీకై మ్రోగే ప్రణవనాదాన్ని నేను.తీసే శ్వాసే ధూపం,చూసే చూపే దీపమైతే నాలోని మామకారమే నీ పూజా కుసమం అంటూ తన ప్రియురాల్ని తన ప్రేమదేవతగా కథానాయకుడు కొలుచుకుంటున్న తీరు రమణీయం.
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ
లలిత!!
మన మనసులే హిమగిరి అన్నంత స్వఛ్ఛంగా,ఉన్నతంగా మారి,మన ఇరివురి అనురాగం బంధము స్వరజతి అయి పశుపతి పాదలను చేరుకొంది!తమ ప్రేమను ఆ పరమేశ్వరునికి అంకితం చేసి తమ రాగ బంధంలో దివ్యానుబంధాన్ని కలుపుకున్నారు!రసానుభూతిలో దివ్యానుభూతి!ఎంత అపూర్వము ఇది!తమ అనురాగ జీవితాన్ని పరమేస్వరునికి ప్రీతిపాత్రమైన సంగీత నాట్యాలతో అల్లుకున్నారు ఇక్కడ! తమ మేని సొగసులు వీణ మీద పలికే జిలిబిలి గమకాలైన వేళ కాలము సిరిమువ్వై నిలిచినది,మనసుకు ఆహ్లదతను,సంతొషాన్ని పెంచే పూల పవనమైనది తాళము.మన వయస్సు గేయమై ఒక మరపురాని మధుకావ్యమైనది.అలా మలుచుకున్న మన మధురమైన జీవితలను ప్రేమ పదం స్వాగతించినది.ఈశ్వర కృపతో ప్రేమ పధాన సాగిన మన బ్రతుకు రధం కొరికల తారల సీమకు వడి వడిగా పరుగేత్తి చేరుకుంది!
ఇప్పటి వరకు వచ్చిన ప్రేమగీతాలలో ఇది నా భూతో న భవిష్యతి అని చెప్పుకుంటే అతిశయోక్తి కాదేమో!ఇప్పుడు వచ్చే పాటలు అందులో ప్రేమగీతాలు ఈ పాటకు సరి సాటి రావు రాలేవు!అవి ఆమడ దూరంలోనే ఆగిఫోతాయి గాని దగ్గరికి అస్సలు చేరుకోనలేవు అని నా వ్యక్తిగత అభిప్రాయం.
[...] సంధ్యని అసుర సంధ్య అని కూడా అంటారు ఎందుకంటే అది పశ్చిమాన వుండి వెలుతురుని (సూర్యుడిని) మింగేస్తుంది కనుక, అటువంటి అసుర సంధ్య కూడా రవి (సూర్యుడు) నిరంతర ప్రయత్నం వలన ఒక్కసారి కూడా నెగ్గలేకపోయింది. అసుర సంధ్య గొంతులోనున్న అగ్గివుండ (సూర్యుడు) సాగరాలని కిందనుంచి ఈదుకుంటూ తిరిగి తూర్పున తేలుతుంది (ఉదయిస్తుంది). నిశ అంటే చీకటి ఇక్కడ నిశ అంటే కష్టము. చీకటి, కష్టము జీవితములో ఎంతోకాలం వుండవు, ఉషోదయము అంటే కవి దృష్టిలో సుభప్రదము (మంచి రోజులు)… ఉషోదయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకే నిరంతరం ప్రయత్నమున్న చోట నిరాశకి కూడా నిరాశ కల్గుతుంది. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఎమిటంటే కవి సంధ్యా సమయాన్ని పరమ పవిత్రంగా వేరొక పాటలో పోల్చారు. [...]
మీ బ్లాగులో వ్యాఖ్య రాయటానికి నేను WordPress account create చేసుకున్నా. ఇంత మంచి పాట గుర్తు చేసినందుకే మీకు చాలా ధన్యవాదాలు చెప్పాలి. దానికి తోడు, ఇంత బాగా అర్థాన్ని చెప్పినందుకు మీకు ఎలా నెనర్లు చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. కానీ, అర్థం మాత్రం అయ్యేది కాదు.
Thank you so much for the lyric and the meaning !!
Regards,
Pradeep.
[pradeep DOT venkatesh AT gmail.com