ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

sivaparvatulu25

చిత్రం: సిరి సిరి మువ్వ
రచన:వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పీ.సుశీల
సంగీత దర్శకత్వం:కే.వీ.మహదేవన్
దర్శకత్వం:కాశినాధుని విశ్వనాథ్

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా

యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా

ఝుమ్మంది

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం

ఝుమ్మంది

మెరుపుంది నాలో – అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో – అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది !!

మొట్ట మొదటసారి ఈ పాట వింటున్నప్పుడు నా మనసు పరవశించిపోయింది.ఈ పాట వెనుక ఉన్న లలితమైన రాగం,అందమైన పదాల పొందిక కారణాలు కావచ్చు.ఎంత మాయ చేస్తోందీ పాట అనుకున్న సందర్భాలు వున్నాయి.కానీ ఒక సందర్భంలో మరోసారి ఈ పాట వింటున్నప్పుడు నాదం ఝుమ్మనడమేమీటీ?పాదం సై అనడమేమీటి?తనువూగడమేమిటీ?రాస లీల చెలరేగడమేమీటీ? కవిగారు తనదైన శైలితో,పదాలతో ఆడుకోవడమేమిటీ? కాశీనాధుని విశ్వనాధ్ అంతటి వారు ఏ మాత్రం సందేహించకుండా తన సినిమాలో వాడుకోవడమేమిటీ? అసలేం జరుగుతోందిక్కడ? అని అనుకున్న రోజులూ కూడా వున్నయి.ఐతే ఈ పాటకు భావం స్ఫురించినప్పుడు,ఈ పాటలోని స్వర మధురిమతో పాటు సాహితీ మకరందపు విశేషం అవగతమయిన హృదయం ఎంతగానో మురిసిపోయింది.

అయితే ఇక్కడ ఈ పాట సినిమాలో ఏ సందర్భంలో వాడారో కూడా తెలుసుకోవాలి,లేకపోతే ఈ పాట యొక్క రమ్యత ప్రేక్షకుల హృదయానికి చేరదనిపించింది.ఇందులో కథా నాయికకు తండ్రి ఉంటాడు కానీ పెత్తనమంతా సవతి తల్లిది.అందుకే కథా నాయికకు ఎంతో ఇష్టమైన నాట్యమును చేయనివ్వదు.ఒకసారి సవతి తల్లి ఎదో పని మీద పొరుగూరికి వెళ్ళినప్పుడు కథా నాయికకు నాట్యం చేసే అవకాశం వస్తుంది. ఆ ఆనందంలో కథా నాయిక పాడుకునే పాట.మధ్యలో నాయకుడు కూడా కలుస్తాడు.కాని అది వేరే సంగతి.

ఈ పాట గురించి నాకు అర్ధమైన విషయమును మీతో పంచుకునే ముందు ఇంకోకటి చెప్పాలనిపించింది అదేమిటంటే … ఈ పాటను మొట్ట మొదటసారి విన్నప్పటి నుంచి ఈ పాటలో నాయికా నాయకులుగా పార్వతీ పరమేశ్వరులను చూడటం జరిగింది కానీ సినిమాలో పాత్రధరులు నాకు కనపడలేదు.బహుశా కవిగారు కూడా ఆదిదంపతులను దృష్టిలో పెట్టుకునే వ్రాసి ఉంటారన్న భావన నాకు కలిగినప్పుడు మనస్సు ఆనందపుటంచుల్లో విహరించింది.

ఝుమ్మంది నాదం అన్న పదం వినగానే మల్లికార్జున స్వామి అవతారమెత్తిన పరమశివుణ్ణి పార్వతి దేవి భ్రమరాంబికా దేవి రూపంలో సేవించిన వైనం గుర్తుకు వచ్చింది.భ్రమరం అంటే తేనేటీగ,మల్లికార్జునము అంటే తెల్లటి మల్లే పువ్వు.తెల్లటి మల్లెపువ్వు చూస్తే ఒక తేనే తీగకు ఆకర్షణ కలుగకుండా వుంటుందా?అలాగే మల్లికార్జున స్వామి రూపంలో ఉన్న శివుణ్ణి చూసిన ఆనందంలో భ్రమరాంబికాదేవి రూపంలో వున్న పార్వతీ దేవి ఝుమ్మని అందిట.అదే నాదమైంది.నాట్యాధిదేవతలు కదా గౌరీశంకరులు.స్వామిని చూస్తున్న సంతోషంలో నాట్యం చేయడం మొదలుపేట్టింది అమ్మ.అయ్య శంకరుని కదిలించే ప్రయత్నంలో అమ్మ ఆనంద తాండవం చేస్తోంది. తల్లి ఆనంద తాండవం చేస్తున్న సమయంలోనే జగ్గత్తుకంతటికీ అభయాన్ని ప్రసాదించే అమ్మ పాదం సై అని అంది.ఏ సమయంలోనయితే అమ్మ భవాని తన పతి అయిన విశ్వనాథున్ని తన నాట్యంతో రాసలీలకు వేళ అయిందని పిలించిందో/పిలుస్తుందో ఆ సమయం రసరమ్యభరితమై లోకాలన్నింటికీ శుభదాయకమైంది/శుభదాయకమవుతుంది.

అమ్మవారు అయ్యవారి కోసం ఇంకా నాట్యం చేస్తూనే వుంది.గౌరీ దేవి,శంకరుని కోసం పడే తాపత్రయం ఇక్కడ వర్ణించారు.నది ఆనందంతో ఎలా ఉప్పొంగి పోతూ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతుందో(ఎలరేటి రొదలా)అలా శాంభవి దేవి ఎదురుగా మల్లికార్జునుని రూపంలో వున్న శంభుని చూసి ఆనందంతో నాట్యం చేస్తోంది.సముద్రం బడబాగ్నిని తన గర్భంలోనే దాచుకున్నట్లు,స్వామి సాక్షాత్కారం కలగటం లేదన్న బాధ ఎక్కువవుతున్నా,దాన్ని తన మనస్సులోనే దాచుకుని పైకి తెలియనివ్వకుండా (ఎదలోని సొదలా) అమ్మ నర్తిస్తున్నది.చాలా సేపటి నుండీ నర్తిస్తున్నా శివ సాక్షాత్కారం కలగకపోవడంతో,కదిలే నది తాను నిర్మలంగా వుంటునే మరింత రమణీయంగా ఎలా ముందుకు సాగిపోతుందో,ఆశలు తరగని హృదయం ఎడతెరగకుండా కలలను ఒక వరదలా ఎలా కంటుందో,అలా తన నాట్యంలో ఆనందపుటావేశం తగ్గినా కూడా ఆపకుండా అంతే పట్టుదలతో , ప్రేమతో ,శివానుగ్రహంకై మరింత రమ్యంగా,రమణీయంగా నర్తిస్తున్నది గిరిరాజపుత్రి.సదాశివుణ్ణి పార్వతీదేవి తన నృత్యంతో ఆరాధిస్తున్న వేళ,అమ్మవారి కదిలే(చలిత) అందమైన(లలిత) పాదపద్మములు(పద),శంభుని పట్ల ప్రేమను కలిగినదై(కలిత),శంకరుణ్ణి స్తుతించే సరికొత్త స్తోత్రమై(కవితై),పశుపతి మనస్సు కరిగేట్టుగా,సామవేద సారమగు సంగీతానికి మూలాధారమైన సరిగమలను పలికించి,సప్త స్వరాలలోని మధురిమలను ఒలికించగా,అమ్మవారి పాదారవిందములకు అంటిపెట్టుకుని వున్న సిరి సిరిమువ్వలతో పాటూ విశ్వమంతా పులికించినది.

“నటరాజ ప్రేయసీ,నీవు నర్తించే ఊర్వశివి అని అనుకున్నాను ఇన్నాళ్ళు.ఇక్కడ నా ముంగిట నర్తిస్తున్నది ఇంద్రుని లోకంలోనున్న అప్సర ఊర్వశి కాదు అని,పర్వతములన్నింటికీ రాజైన హిమవంతుని కూతురు ఉమాదేవివని ఇప్పుడు తెలిసింది. నీవు యోగమాయవు కదా,నా శక్తిస్వరూపమైన నిన్ను గుర్తించడానికి ఇన్నాళ్ళు పట్టింది.ఎప్పూడైతే నా కోసం తపిస్తున్నది నాలో ఉన్న నీవేనని గ్రహించానో,ఆనాడే నాలో నున్న ఆవేశం ఆకాశమై పొంగిపోయినది.శివస్వరూపమైన కైలాసమే వంగి నీ రాకకై ఎదురు చూస్తున్నది” అంటూ పొంగిపోయెను ఆమ్మవారి ప్రేమకు,తపస్సుకు మెచ్చిన విశ్వాత్మకుడైన పశుపతి .
శివపార్వతులు ఒకరి కొసం ఒకరు చేస్తున్న తపస్సు ఈనాడు ఫలించింది.ఆది దంపతులు మళ్ళీ ఒకటయ్యారు.ప్రపంచమంతా పులకరించిపోయి హర్షం వ్యక్తం చేసింది.ఆనందం పరవశులై వారు నాట్యం చేస్తున్న వేళ “శివ సన్నిధిని పొందడం వల్ల నాలో కలిగిన సంతోషం మెరుపై నిలిచినది(మెరుపుంది నాలో)” అన్న గౌరమ్మ మాటలకు,”చిరునవ్వుతో నీవు నా చెంత చేరినప్పుడు నీ మేనిలో కలిగే విరుపే అది(అది నీ మేని విరుపు) ” అని శివయ్య బదులు ఇచ్చేను.దానికి ” మరి నాకు కోపం కొంచెం ఎక్కువే,అప్పుడప్పుడు కోపం ఎక్కువైనప్పుడు గర్జిస్తూ వుంటాను కదా (ఉరుముంది నాలో)” అన్న ఉమా దేవి పలుకులకు శంకరుడు “దేవీ! నువ్వు అమ్మల గన్న అమ్మవు,ముజ్జగాలకే మూలపుటమ్మవు.నీ కన్నులు లోకాలన్నింటిపైనా కరుణామృత వర్షమును కురిపిస్తాయే కానీ అగ్నిని వర్షించవు అని నాకు తెలుసు. నువ్వు శ్రీమన్నారాయణుని చెల్లెలివి.అందుకే ఆయనలానే నువ్వూ దుష్ట సంహారానికై అవతారాలు ఎత్తుతావు.దుర్గ అని,కాళి అని,చండి అని ,చాముండీ అని ఒకట రెండా, ఇలా ఎన్నెన్నో అవతారలు ఎత్తి దైత్య సంహరాలేన్నింటినో నువ్వు కావించినా ,ఆ సమయంలో నువ్వు చేసే వీరహుంకారము నీ అందెల రవళులై నన్నే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు (అది నీ మువ్వ పిలుపు). ఒకే సమయంలో రాక్షసులపై వీర రసమును,నాపై శ్రంగార రసమును కురిపిస్తావు.ఇలా చేయడం నీ ఒక్కదానికే చెల్లును కదా!రాక్షస సంహారం గావించి శాంతించిన తరువాత నువ్వు మూర్తీభవించిన శివానందలహరివి .ఎల్ల లోకాలకు శుభమును జేకూర్చే సౌందర్యలహరివి.మహదానందంతో నువ్వు నాట్యం చేస్తున్న వేళ,నీ కరుణే అమృతవర్షమై,ప్రతి చినుకులోనూ లయ తప్పకుండా నర్తిస్తూ,లోకాలపై ప్రసరించే తొలకరి జల్లైనది.అంతేనా నువ్వు నాతో నడిచిన ఏడడుగులు,నాతో నువ్వు కలిసున్నప్పుడు నీలో కలిగిన సంతోష తరంగాలే ఏడు రంగులుగా, లోకాలన్నింటికి ముదమును జేకూర్చే అందాల హరివిల్లు అయినది కదా..”అన్న శివయ్య మాటలకు,అమ్మతో పాటూ లోకాలన్నీ కూడా ఎంతగానో మురిశాయి.ఎంతైనా శివా అంటేనే మంగళమును ప్రసాదించువాడు అని,ఙ్ఙానమే శివస్వరూపంలో ఉంటుంది అని మనము తెలుసుకున్నాము. ఎంతైనా అమ్మ,అయ్య ఇద్దరూ ఒకటే కదా! శివుని శరీరంలో అర్ధ భాగాన్ని స్వీకరించి అభవార్ధభాగిని అనిపించుకున్నది మా అమ్మ పార్వతీ దేవి.అలాగే అమ్మకు తనలో సగ భాగమిచ్చి అర్ధనారీశ్వరుడవనిపించుకున్న వాడు మా తండ్రి పరమేశ్వరుడు.ఇలా ఇద్దరూ ఒకరికొకరు సరిగ్గా బాగా ఎలా సరిపోయారో మన అందరికి తెలుపడానికే కదా కవిగారు ఇంత ప్రయత్నము చేసినది.అందుకే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము.

నటనం ఆడేనే

sivaparvatulu202

చిత్రం:శుభోదయం
పాడిన వారు:యస్.పీ.బాలు,పీ.సుశీల
దర్శకత్వము:కే.విశ్వనాథ్
సంగీతము: కే.వీ.మహదేవ

నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని !!

!! నటనం ఆడేనే

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల

!! నటనం ఆడేనే

శివగంగ శివమేత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా
హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము
గరుడా నాదానంద కావ్యమై వరలగా

!! నటనం ఆడేనే

వసుధ వసంతాలు ఆలపించగా
సురలు సుధను ధరలో కురిపించగా
రతీ మన్మధులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా

ఓ శంకరా!అభవుడవై ఈ ప్రపంచానికి అస్థిత్వమై నిలిచావు నీవు.భవుడవై ఈ జగత్తు మనుగడకు కారణభూతుడవైనావు.స్వామీ !అలాంటి నువ్వు ప్రాపంచిక వ్యామోహమనెడి చీకటిని సంహరించే పరమశివుడవు.మహాదేవా! నీవు నర్తించడం వలన నాట్యానికి ప్రత్యేక గౌరవం,పవిత్రత లభించినా కరుణా సముద్రుడవు కనుక నటకావతంశుడు (నాట్యానికి ఆభరణము)అని అనిపించుకున్నావు.అలాంటి నువ్వు నేడు ఆనందస్వరూపుడివై తకధిమి తకధై అంటూ ఆనంద తాండవం చేస్తున్నావు.నీవీనాడు ఎందుకింత ఆనందంగా వున్నావో నాకు తెలిసిందిలే…అమ్మలను గన్న అమ్మ,ముజ్జగాలకే మూలపుటమ్మ మా అమ్మ పార్వతీ దేవిని పరిణయమాడి నీవు ఉమారమణుడవు అనిపించికున్నావు.అంతేనా నీ దేహంలో సగ భాగమిచ్చి అమ్మపై నీకు గల అనురాగం లోకాలన్నింటికి చూపించి పాఠం నేర్పావు.

ప్రభూ! మీ గౌరీశంకరుల కళ్యాణం జగత్కళ్యామే కదా! ఈ అనందం మీకే కదు మా అందరికి కూడా.జగదానంద కారకులైన మిమ్ములను చూసి ఎనిమిది దిక్కులన్నీ ఒక్కటై పోయినట్లు,సూర్యుడే చంద్రుడై ఎండకు బదులు వెన్నెల కురిపిస్తున్నట్లు మాకు అనిపిస్తున్న వేళ ,మూడు కన్నులున్న నీవు కైలాసాన్ని వీడి విశాలమైన కన్నులున్న మా అమ్మ గిరిరాజపుత్రితో ఆనందంగా లయ,తాళములను తప్పకుండా నాట్యము చేస్తూ వుంటే,రాగ,తాళ,లయ,శృతులకు,మా అందరికీ మీరే గతి అని మాకు ఈనాడు బోధ పడింది.

పరమశివా! పార్వతీపరమేశ్వరులైన మీ ఇద్దరి నాట్యము చూసి నీ జటాజూటంలో కొలువై ఉన్న గంగమ్మ తల్లికూడా ఆనందాముతొ ఉప్పొంగిపోతోంది…అలాగే నీ శిగలో కుసుమంలా అలరారుతున్న నెలవంక చిరునవ్వులు చిందిస్తూ మరింతగా శోభిస్తున్నాడు.హర హర మహాదేవా! నీ కళ్యాణ మహోత్సవ సందర్భంగా హరిహరాత్మకమగు ఈ ప్రపంచమంతటా గరుడనాదానంద కావ్యమై ప్రకాశిస్తున్నది.సర్వ జగత్తుకూ మంగళాన్నీ,ఙానాన్ని ప్రసాదించే శంకరా!శివ కేశవులు అభేధమని ఈ జగమంతటికీ చాటుతూనే వున్నావు కదా!నీ హృదయాన్ని కవి అర్ధం చేసుకున్నరు కనుకనే హరిహరాత్మకమైన ఈ ప్రపంచమును,వేదములను తన నాదముగా జేసుకున్న గరుత్మంతుని స్మరిస్తూ విష్ణు స్తుతి చేసారు ఇక్కడ.

మహేశా!విశ్వమంతా పార్వతీపరమేశ్వరుల కళ్యాణం ఎప్పుడు జరుగుతుందా?కుమారస్వామి ఎప్పుడు ఉదయించి తారాకాసురుణ్ణి సంహరిస్తాడా అని ఎదురుచూస్తున్నదయ్యా! సతీ దేవి హైమవతిగా జన్మించి మళ్ళీ నిన్ను చేరుకున్నది.భూదేవి వసంత రాగాలను ఆలాపిస్తున్నది.దేవతలు అమృతాన్ని వర్షిస్తున్నారు.రతీ మన్మధులు ఈ జగమంతటికీ శుభోదయాన్ని ప్రసాదించే కుమార స్వామి సంభావానికి నాంది పలుకుచున్నారు.విశ్వనాథా! నువ్వు మా అమ్మ పార్వతీ దేవి కలిసి తారకాసురుడనే అఙ్జానాంధకారమును పారద్రోలే ఙాన స్వరూపుడైన కుమార స్వామిని మాకు ప్రసాదించండీ…

 


చిత్రం:మానవుడు-దానవుడు
పాడిన వారు:యస్.పి.బాల సుబ్రహ్మణ్యం
రచన:సీ.నారయణ రెడ్డి

అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై నడిపించ రావా

మనిషే మనిషే కరిచే వేళా
ద్వేషము విషమై కురిసే వేళా
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలు చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించగ రావా

అణువు అణువున!!

జాతికి గ్రహణం పట్టిన వేళా
మాతృభూమి మొరుపెక్కిన వేళా
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించగ రావా

అణువు అణువున!!

వ్యాధులు బాధలు ముసిరే వేళా
మృత్యువు కోరలు సాచే వేళా
గుండెకు బదులుగ గుండెను పుదిగి
కొన ఊపిరులకు ఊపిరులు ఊది
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవా గుణం  మాకందించ రావా
 

ఓ ప్రభూ!ఈ ప్రపంచమంతటా నీవు వ్యాపించి వున్నావు.సర్వాంతర్యామివి.మా అందరిలో ప్రాణానికి ప్రాణమై ఉన్నావు.మా ఊనికికి కారణభూతమై ఉన్నావు.అటువంటి నిన్ను వెఱ్ఱి వెఱ్ఱి ఆలోచనలలో  మునిగి,అర్ధం పర్ధం లేని పనులలో మమ్ములను మేము తీరుబడి లేకుండా చేసుకుని నిన్ను హృదయంలో కనిపించీ కనిపించని చోటులో దాచేసి ఆ విషయం మరిచిపోయి మేము ఙ్ఙానాంధులము అయిపోయాము.మా జీవనాధరమైన నీ అస్తిత్వమును మరుగుపరిచిన కారణంగా నేడు ఏ తోడూ లేకుండా తిరిగే అంధుని వలే అనేక ఇక్కట్లు పడుతున్నాము.ఇప్పటి వరకు మేము చేసిన తప్పులను క్షమించి, మమ్ములను మన్నించి మాపై దయ చూపి మా కనులకు వెలుగై మమ్ములను నడిపించగ రావా తండ్రీ!

ఓ ప్రభూ!కంటికి జబ్బు చేసినప్పుడు జ్యోతి ఎలా సరిగ్గా కనపడదో అలా మా మనస్సులకు స్వార్ధం అనే జబ్బు చేసింది.ఎంత తీవ్ర స్థాయిలో ఆ రోగం ముదిరి పోయిందంటే మా అస్తిత్వమునకు కారణమైన నిన్ను మరిచిపోయి నీ ఊనికినే ప్రశ్నిస్తోంది నేడు.మమ్ములను గన్న మా తండ్రీ!ఎప్పుడైతే నీ ఊనికిని ప్రశ్నించటం మొదలు అయ్యిందో అప్పుడే మనిషి తనను అతః పాతాళానికి తీసుకు వెళ్ళే దారులలో పయనించటం మొదలు పెట్టాడు.ధనం,బంగారం,ఇతరత్రా కోరికలను తీరుచుకోవడం కోసం నైతీక విలువలను వదిలి మరింత పతనమవుతున్నాడు ప్రభూ! మనిషిని మనిషే హత్య చేస్తున్నాడు.నీ పేరు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు,హింసను ప్రోత్సహిస్తునాడు.ప్రభుత్వాలను పడగోట్టి దేశముల మధ్య వైరమును సృష్టించి ప్రపంచాన్నంతటినీ మింగజూస్తూన్నాడు.శాంతికి భంగం కలిగిస్తున్నాడు. జగమంతటా ద్వేషమనే నిప్పుల వర్షం కురుస్తోంది.

ఓ ప్రభూ! ఆనాడు పరమ శివుడివై హాలాహలమును మ్రింగి లోకాలన్నింటిని రక్షించావు.ఆ తరువాత శ్రీహరివై దుష్టులైన దానవులను శిక్షించి దేవతలకు అమృతాన్ని ప్రసాదించావు.నీ లీలను అర్ధంచేసుకునే కదా  ఆనాడు ప్రపంచానికి సత్యాన్ని అందించాలన్న ప్రయత్నంలో నిప్పులాంటి విషాన్ని మ్రింగి ఆమరజీవైనాడు సాక్రటెస్…మనుష్యులకు మానవత్వం ,నిస్వార్ధమైన ప్రేమ అనే  అమృత గుణాలను అందించే ప్రయత్నంలో తమ జీవితాలను,ప్రాణాలను త్యాగం చేసి అమరజీవులై,మా కనులకు వెలుగును అందింప జేసిన వారు (జీసస్ క్రీస్తు,గౌతమ బుద్ధుడు) ఎందరో … ఆలాంటి మహానుభావులందరి అమృత గుణం మాకందించగా  రావా ప్రభూ!

ఓ ప్రభూ!కొన్ని వందల సంవత్సరాలు  బ్రిటీషు పాలనలో వున్న భారత దేశం  తన సంపదలను కోల్పోవడమే కాకుండా తన ప్రజల రుధిరంతో ఎర్రబడినది.మహత్మా గాంధీ,అల్లూరి సీతారామరాజు,ఝాన్సీ లక్ష్మీ భాయి,నేతాజీ సుభాష్ చంద్ర బోస్,భగత్ సింగ్,సర్దార్ వల్లభాయి పటేల్,బాల గంగాధర్ తిలక్,అంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి వారు ఎందరో మహానుభావులు స్వరాజ్య సమరం సాగించి,స్వాతంత్ర ఫలమును సాధించి మాకు అందించారు.దేశ మాత కోసం ,తోటి ప్రజల కోసం తమ జీవితాలను,ప్రాణాలను త్యాగం చేసి ధన్యజీవులైనారు. అటువంటి ధన్య జీవుల త్యాగ నిరతిని మాకు అందించగ రావా తండ్రీ!

ఓ ప్రభూ!అఙ్ఙానం,ఛాందసవాదం,స్వార్ధం,పేదరికం వంటి కారణాలెన్నో మా మనస్సులను,జీవితాలను చీకటిమయం చేసాయి.అందుకే ధనవంతులు మరింత ఐశ్వర్యవంతులుగా ఎదుగుతున్నరు,పేదలు మరింత నిరుపేదలవుతున్నారు.వైద్య సదుపాయం లేకపోవడంతో వ్యాధులు చాప క్రింది నీరులా ప్రాణాలను హరిస్తున్నవేళ,పేదరికం పరిహాసం చేస్తున్న వేళ,మా మనస్సులలో అణగారిపోయిన ఆశలను చిగురింప జేసి,ప్రేమతో సరి అయిన వైద్య సేవలను అందించి, మా ప్రాణాలను నిలబెట్టి, జీవన దాతలై వెలిగిన మదర్ థెరీసా వంటి ఎందరో అమృత స్వరూపుల సేవా గుణం మాకందించగ రావా తండ్రీ!

చిత్రం: ఇద్దరు అమ్మయిలు
పాడినవారు:పీ.సుశీల

ఈ పాటను మీరు ఇక్కడ వినవచ్చు

ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి…అనురాగం పండాలి …

పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా ఈ పచ్చని ముంగిట కురవాలి

శుభములొసగే  మందిరము శాంతికి నిలయము కావాలి
లక్ష్మీ సరస్వతి పొందికగా ఈ ఇంటను కాపురము వుండాలి.

ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో మీ వాకిలి కళకళలాడాలి 

నాకు ఈ పాట సాహిత్య పరంగాను,సంగీత పరంగాను చాలా ఇష్టము.సినిమాలో నూతన గృహ ప్రవేశం సందర్భంలో కథా నాయిక పాడిన పాట.ఈ పాట సాహిత్య పరంగా చాల సరళముగా అనిపించినా భావ పరంగా కొంచెం క్లిష్టమైనదిగా అనిపించింది ఎందుకంటే ఆచరణలో అది కష్టము అని భావిస్తున్నాను.

sivaparvatulu02.jpg;

మొట్ట మొదటి వాక్యం “ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో” అని విన్నప్పుడు చల్లని చిరుగాలి సున్నితంగా మనస్సును తాకి వెళ్ళిన అనుభూతి కలిగింది.ఎందుకంటే చల్లని లోగిలి అంటే ఇల్లంతా ఏసీచే చేయించబడినదై,గోడలు- పై కప్పు ఖరీదయిన రంగులతోను,ఇతర వస్తువులతో నింపబడిన  భావన నాకు కలుగ లేదు కాని  స్ఫురించిన విషయము  అతిధి దేవోభవ అన్న ఆర్యోక్తి.అతిధి రూపంలో వున్న భగవంతుడు ప్రసన్నుడు అయిన నాడు మన ఇల్లే దేవాలయం అవుతుంది.అతిధి సంతృప్తి పడేది ఎప్పుడు అన్న ప్రశ్నకు సమధానం పెద్దలే చెప్పారు మనకు.ఎప్పుడైతే ఇంటి యజమాని,ఇల్లాలు,ఇతర కుటుంబ సభ్యులందరూ తమ తమ ధర్మాలను పాటిస్తూ,తమ తమ మృదు మధుర వచనాలతో ఇంటికి వచ్చిన అతిధిని సంతోష పరుస్తారో అప్పుడు ఆయన ప్రీతి చెందిన హృదయంతో మీరందరు పిల్లా పాపలతో చల్లగా వుండి వర్ధిల్లాలని,ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి పొందాలని,సుఖ సంతోషాలతో వుండాలని ఆశీర్వదిస్తాడు.ఆలా మన గృహమునకు వచ్చిన అతిధి మన అభివృద్ధిని కోరుకున్ననాడు మన ఇంట్లో శక్తితో కూడిన పరమేశ్వరుడు నివసించడం ప్రారంభిస్తాడు.పర్వతీ సమేతుడైన శివుడు మన ఇంట్లో వుండటం వల్ల మన గృహము చల్లని లోగిలి కలిగిన బంగారు కోవెల అవుతుంది.ఎప్పుడైతే శివపార్వతులు మన ఇంట్లో కొలువై వుంటారో ఆనాడే మన ఇల్లు ఆనందనిలయముగా మారి భార్య భర్తల మధ్య నున్న అనురాగం పండుతుంది.కుటుంబ సభ్యుల మధ్య నున్న మమతలు,ఆప్యాయతలు పెనవేసుకున్నప్పుడు ఆ కుటుంబము నలుగురికీ ఆదర్శప్రాయమవుంది.

krishna122.jpg

పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి

ఇక్కడ ఈ వాక్యం వింటున్నప్పుడు నాకెందుకో గోకులములోని గోపాల కృష్ణుడే గుర్తుకు వచ్చాడు…నంద నందుని అల్లరి..తోటిపిల్లలతో కలిసి ఆయన చేసిన లీలలూ అంతా గుర్తుకు వచ్చాయి.మనమేంతో పుణ్యం చేసి వుండాలి అందుకే శ్రీకృష్ణుడు పిల్లల పాపల అల్లరితో మన ఇంటిని నింపి మన గృహమును తాను నివసించడానికి వీలుగా వుండేటటువంటి గోకులము,బృందావనముగా మార్చి తాను కొలువై వున్నాడని నాకు  అనిపించింది..భార్యాభర్తల గొడవలు గానీ లేక ఇతర పెద్దల చికాకులు లేని ఇల్లు పిల్లలకు స్వర్గమే కదా.. తల్లితండ్రుల ప్రేమాభిమానాలు పుష్కలంగా వుండీ,తాతయ్యల,బామ్మ అమ్మమ్మల మమతానురాగాలు నిండుగా వున్న ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలు సంస్కారవంతులుగా,మంచి పౌరులుగా పెరుగుతూ వుంటారు కదా .. అటువంటి పిల్లల ఆట పాటలతో అల్లరితో విలసిల్లే ఇల్లు బృందావనమే అవుతుంది…ఏ ఇంట్లో పిల్లలు సంతోషంగా వుండి,శారీరికంగా,మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతూ వుంటారో అక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామా సహితుడై,తన తల్లి తండ్రులతోటి,గోపికలు గోపాలకులతోటి ఆ ఇంట కొలువై ఉండి సర్వదా రక్షిస్తూ వుంటాడు కదా…  

అమ్మలను గన్న అమ్మ,ముజ్జగాలకు మూలపుటమ్మ,స్త్రీలకు  సకల శుభములను,సౌభాగ్యములను ఇచ్చి రక్షించే పెద ముత్తైదువు,నిత్య సుమంగళి,సర్వ మంగళ మన అమ్మ గౌరమ్మ సంతోషిస్తేనే కదా పసుపు కుంకుమలు నిత్యమూ మన ఇంట వుంటాయి.మరి అమ్మ పార్వతీ దేవి సంతోషించాంటే మనం ఏమి చేయాలి? ఏ ఇంట అయితే భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకుని సీతారాముల్లా అన్యోన్యంగా వుంటారో,ఏ ఇంట అయితే అక్కా చెల్లెళ్ళు-అన్న దమ్ములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లా కలిసి మెలిసి ఆనందంగా వుంటారో,ఏ కుటుంబమైతే శివ కుటుంబంలా కలిసి కట్టుగా తాము సంతోషంగా వుంటూ తమకున్న భాగ్యాన్ని నలుగురితో కలిసి పంచుకుంటారో,ఏ కుటుంబమైతే పదుగురికీ సహాయం చేస్తుందో,ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని చూచి అమ్మ మనసు పరవశిస్తుంది.ఎప్పుడైతే జగన్మాత సంతోషిస్తుందో అప్పుడు బంగారం వంటి మనస్సులనే లోగిళ్ళు కలిగిన ఇంట పసుపు కుంకుమలను కొల్లలుగా కురపిస్తుంది. అలా ఆది దంపతుల కరుణా స్రవంతి నిత్యమూ మనపై జాలువారుతున్నప్పుడు మన ఇల్లు శుభములనోసగే మందిరమై  శాంతికి నిలయము అవుతుంది.

lalita03.jpg

ఏ ఇంటిని చూచి ఉమ దేవి సంతోషించి పసుపు కుంకుమలను కురిపించి సకల శుభములను కలిగించి సదా శివుని కృప  మనకు లభించేలా చేస్తుందో,ఆ ఇంటిని చూచి పరమానందమును చెందిన  శ్రీమహాలక్ష్మి సకల సంపదలను, ఆయురారోగ్యాఇశ్వర్యములను ప్రసాదించి శ్రీమన్నారాయణుని కరుణ ప్రసరించేలా ఆశీర్వదిస్తుంది.అలాగే సకల కళలకు మూల శక్తి,ఙ్ఙాన స్వరూపిణీ అయిన సరస్వతి దేవి సంతోషించి మనకు ఙ్ఙానాన్ని కాటక్షించి  సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అనుగ్రహం మనకు లభింపజేస్తుంది.

ఎప్పుడైతే మన ఇల్లు సకల దేవతలకు నివాస స్థానము అవుతుందో ఆ ఇల్లే దేవాలయము అవుతుంది.. ఆ ఇంటి ఇల్లాలే త్రిగుణాత్మకమైన ఆన్నపూర్ణా దేవిగా ఎల్లరి మనములకు సుఖ శాంతులను ప్రసాదిస్తుంది.తమ తమ ధర్మాలను తాము నిర్వహిస్తూ,దేవతల అనుగ్రహానికి ఏ కుటుంబ సభ్యులైతే పాత్రులవుతారో ఆ  ఇల్లు ఎల్లప్పుడు వచ్చే పోయే అతిధులతో,ప్రతీ రోజు ఒక పండుగగా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణం గా వుంటుంది.  

జగన్మాత శ్లోకం

devi17tro2.jpg

ఓంకార_పంజర_శుకిం = ఓంకారమనే పంజరం లో ఉండే చిలకను [ఆదిప్రణవనాదమే ప్రాకారములుగా మెలిగే ఓ సుమధురభాషిణీ సాధుశీలీ]

ఉపనిషద్_ఉద్యాన_కేళీ  = ఉపనిషత్తులనే ఉద్యానవనం లో ఆడుకునే [ఉపనిషత్తులన్నీ నీ లీలల ప్రతిబింబాలే]

కల_కణ్ఠీం = తియ్యనైన గొంతు కలదానను [ అంటే సత్యము, ధర్మము మాత్రమే,శ్రేయోదాయకమైన పలుకులను పలికే దానను ]

ఆగమ_విపిన_మయూరీం = వేదాంతము అనే అడవిలో నృత్యం చేసే నెమలిని [ఆగమము = a treatise on vedantamu or vedas describing religious rites, శాశ్వత_ఙ్ఙానాన్ని కలిగి, అది సూచించే ప్రాకారములలోనే నిత్యానందం తో మెలిగే దానను]

ఆర్యాం = పూజించదగినదానను, అమ్మను [ గొప్పదానను]అంతహ్_విభావయేత్ = మనసులో ఉంచుకొని, నేను ఆధ్యాత్మిక సచ్చిదానందాన్ని పొందెదను గాక [విభావయేత్ = any condition which excites or develops a partic. state of mind or body , any cause of emotion]

గౌరీం = పర్వతరాజు కుమార్తెను

పల్లవి:

అఖిల_అండ_ఈశ్వరి = విశ్వం అంతటికీ పరమైన శక్తి

చాముండేశ్వరి = మహిషాసురుడిని అంతమొందించిన దానా
గౌరి = ఓ గిరిరాజ తనయా
మాం పాలయ = నన్ను రక్షించు
మాం పరిపాలయ = నన్ను సంరక్షించు (పరి,సం, ఇత్యాదివన్నీ prefixes సంస్కృతం లో, వాటిని ఏమని పిలుస్తారో గుర్తులేదు )

వైష్ణవి (పార్వతీదేవి) స్తుతి:

parvati_silo.gif
శుభ_గాత్రి = మంగళకరమైన మోము కలదానా, చల్లని చూపులతో పిల్లలను అనుగ్రహించెడిదానా
గిరి_రాజ-పుత్రి = పర్వతాలకు రాజు (శ్రేష్ఠుడు) ఐన హిమవంతుని పుత్రికా
అభీనేత్రి = బాగా నటించగలదానా (నృత్యం చెయ్యకలదానా)
శర్వ_అర్ధ_గాత్రి = శివుని శరీరం లో సగభాగమా [గాత్రము = body]
సర్వ_అర్థ_సంధాత్రి = అన్ని సిరులనూ కలిపి మోసెడిదానా, అన్ని క్రియలను నీలో చేర్చుకునేదానా (అని నాకు అర్థం అయ్యింది, not sure)

జగత్_ఏక_జనయిత్రి = ఈ విశ్వమంతటికీ ఒకే ఒక్క (అన్ని జీవులనూ సమానంగా చూసెడి) తల్లీ (అంతటికీ మూలాధారం నువ్వే)
చంద్ర_ప్రభా_ధవళ-కీర్తి = పౌర్ణమి చంద్రుడి తెల్లని కాంతులతో సమంగా భాసించెడి కీర్తి కలదానా

చతుహ్_బాహు_సంరక్షిత_శిక్షిత_చతుహ్_భుజ_అంతర_భువన_పాలినీ = నాలుగు చేతులతో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ నాలుగు దిక్కులు అనెడి నీ భుజముల మధ్య ఉండే ఈ భువనాలన్నింటినీ పాలించెడిదానా

కుంకుమ_రాగ_శోభిణీ = కుంకుమయొక్క రంగుతో శోభించే సర్వమంగళా
కుసుమ_బాణ_సంశోభిణీ = పుష్పములతో అలంకరించబడిన బాణాలతో శోభించేటిదానా I did not understand the rationale behind this
మౌన_సుహాసిని = మౌనముగా (యోగనిద్రలో – అనవసరమైనవాటిని దూరం చేసి) మంగళకరమైన నవ్వు తో వెలిగే దానా
గాన_వినోదిని = గానముచే ప్రసన్నమగుదానా, గానమును ఇష్టపడెడిదానా
భగవతీ = ఓ పరమాత్మా (శ్రీమహావిష్ణువు యొక్క చెల్లెలా అని కూడా వస్తుంది అని నా నమ్మకం)
పార్వతీ = పర్వత రాజునందు జన్మించినదానా
దేవీ = ఓ దేవతా!

భార్గవి (లక్ష్మీదేవి) స్తుతి

mahalakshmi03.jpg

శ్రీహరి_ప్రణయ_అంబు_రాశి = శ్రీమహావిష్ణువుయొక్క అనురాగము అనేడి సముద్రమా – శ్రీహరి ప్రేయసీ

శ్రీపాద_విచలిత_క్షీర_అంబు_రాశి = ఆ శ్రీమహావిష్ణువు యొక్క దివ్యమైన పాదాలు చరించే పాలసముద్రమా (అన్నట్టు లక్ష్మీదేవి పాలసముద్రుని కుమార్తే  – కాబట్టి ఇది ఇంకా justify అయ్యింది)

శ్రీపీఠ_సంవర్ధిని = శ్రీ పీఠాన్ని పెంచినదానా (శ్రీ పీఠం గురించిన వివరాలు దొరకలేదు)

డోల_అసుర_మర్దిని = డోలా అనే పేరు కల రాక్షసుని సంహరించినదానా

ధన_లక్ష్మీ, ధాన్య_లక్ష్మీ, ధైర్య_లక్ష్మీ, విజయ_లక్ష్మీ, ఆది_లక్ష్మీ, విద్యా_లక్ష్మీ, గజ_లక్ష్మీ, సంతాన_లక్ష్మీ అనెడి నామాలతో అష్టలక్ష్మీరూపాలను దాల్చి

సకల_భోగ_సౌభాగ్య_లక్ష్మీ = నీ బిడ్డలకు అవసరమైన అన్ని భోగ_భాగ్యములూ,సౌభాగ్యములను కలిగిస్తున్నదానా

శ్రీమహాలక్ష్మీ = మహోన్నతమైన లక్ష్మీ దేవీ!

వాగ్దేవి (సరస్వతిదేవి) స్తుతి

srisaraswati04.gif

ఇందు_వదనే = పౌర్ణమి చంద్రుని తో సమంగా భాసించెడి మోము కలదానా
కుంద_రదనే = మల్లియల్లాంటి పళ్ళు కలదానా (అంటే కేవలం సుగంధాన్ని మనసుకు ఆహ్లాదాన్నీ కలిగించేటువంటి పలుకులనే పలికెడిదానా)
వీణా_పుస్తక_ధారిణే = వీణా (అంటే కళనూ) పుస్తక (అంటే విద్యనూ) ధారిణే (అంటే ధరించేదానా – అంటే మూలమైనదానా)
వ్యాస_వాల్మీకి_శుక_శౌనక_ఆది = వ్యాస, వాల్మీకి, శుకుడు, శౌనకుడు ఆది గా కల
ముని_గణ_పూజిత = మునుల కులముచే పూజించబడెడి
శుభ_చరణే = శ్రేయస్సును కలిగించెడి పాదాలు కలదానా
సరస_సాహిత్య = లలితమైన (ఆనందము కలిగించే) సాహిత్యము అనెడి
స్వరస_సంగీత = స్వరములతో కూడిన సంగీతము అనెడి
స్తన_యుగళే = రెండు చన్నులు (బ్రేస్త్స్) కలదానా (జగత్తులో నీ బిడ్డలకందరికీ ఈ కళలతో ఆకలితీరుస్తున్నావు, ఆనందాన్ని కలిగిస్తున్నావు)
వరదే = వరములను గుప్పించెడిదానా
అక్షర_రూపిణే = నాశనం లేని (కళల, విద్యా రూపంలో) రూపం కలదానా, అక్షరము అనెడి రూపం దాల్చిన చదువులతల్లీ
శారదే = చలువను కలిగించెడి దానా (అని నా ఉద్దేశ్యము)
దేవీ = ఓ దేవతా!

త్రిగుణాత్మిక స్తుతి

durga03.jpg
వింధ్య_అటవీ_వాసినే = వింధ్య పర్వతమునానుకొనియున్న (ఙ్ఙానము అనెడి అడవిలో) అటవులలో నివశించెడిదానా
యోగ_సంధ్యా_సముత్_భాసినే = యోగము అనెడి ఉదయంలో వెలిగేటువంటిదానా
సింహాసన_స్థాయినే = సింహన్నే ఆసనముగా నిత్యం ఉండెడిదానా, (జగత్తు అనెడి సింహాసనమును అలంకరించియున్నదానా – అనేది ఎంతవరకి చొర్రెచ్త్ ఓ తెలియదు)

దుష్ట_హర = చెడునీ చెడ్డవారినీ నాశనము చేసెడిదానా
రమ్హ_క్రియా_శాలినే = (రమ్హ అంటే అర్థం కాలేదు – బ్రహ్మ కూడా అయి ఉండవచ్చు – నా శ్రవణదోషం కావచ్చు) అన్ని పనులనూ చెయ్యగలదానా ( అని అనుకుంటున్నాను )
విష్ణు_ప్రియే = శ్రీమహావిష్ణువుకు ప్రియమైన దానా

సర్వ_లోక_ప్రియే = సర్వలోకములకు ఇష్టమైనదావు.తల్లిగా సర్వ జీవుల నమస్సులను అందుకొనుచున్నావు.

ధర్మ_సమర_ప్రియే = ధర్మ కోసం నిరంతరం సాగేటి యుద్ధాన్ని ఇష్టపడేదానా (ధర్మాన్ని నిలిపే దానా)
హే బ్రహ్మచారిణే = పరబ్రహ్మన్ని ఉపాసిస్తూ నిత్యమూ పరబ్రహ్మముతో ఉండెడిదానవు.
దుహ్_కర్మ_వారిణే = చెడ్డ పనులను నివారించే శక్తి_స్వరూపిణీ
హే విలంబిత_కేశ_పాశినే = ఓ నెమ్మదిగా పారే/కదిలే- తాడులాగా కనబడే – జడ కలదానా
మహిష_మర్దన_శీల = మహిషుడనే రాక్షసుడిని నాశనం చేసినదానా, అంటే అఙ్ఙానమును అంతం కలిగించడమే శీలముగా (అంటే గుణము) కలదానా
మహిత_గర్జన_లోల = గొప్పగా అరుచుటయందు ఆసక్తి కలదానా(అంటే గొప్ప నాదమా అని కావచ్చు – దుష్టులకు హృదయవిదారకంగా,సజ్జనులకు మహోల్లాసముగా తోచే నాదం/గర్జన చేసే దానా)
భయ_ద_నర్తన_కేళికే = భయము కలిగించెడి నాట్యము (నాట్యము) అనెడి ఆటయందు నిమగ్నమైనదానా (చెడ్డవారికి మరీ భయం కలిగిస్తుంది)
కాళికే = ఓ కాళి మాతా!
దుర్గమ_అగమ_దుర్గ_వాసినే = వెళ్ళడానికి కష్టమైన, వెళ్ళడానికి కుదరని కోటలో నివసించేదానా (ఎవ్వరూ అర్థం చేసుకోలేని పరమార్థమా)
దుర్గే = ఓ దుర్గా
దేవీ = ఓ దేవతా!

My special thanks  to Sri Ramakrishna garu

ఈ పాదం …

brahmakadiginapadamu.gif

చిత్రం:మయూరి.

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం


ఈ పాదం !!

ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆనాటి బలికి అంతం
తనలోనే గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనే ఆ గౌతమే పొంగగా
పాత పాటలో తను చరణమైన వేళా
కావ్యగీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసిన

ఈ పాదం !!

ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ భక్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీ గంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర స్వర నారదా మునులు జనులు కొలిచిన

ఈ పాదం !!
           బ్రహ్మ కడిగిన పాదము ..బ్రహ్మము తానేనీ పాదము  అంటూ ఏడు కొండలపైన శ్రీ వేంకటేశ్వరునిగా వేలసిన నీ చరణారవిందములను ఆశ్రయించిన అన్నమాచార్యుల వారు ధన్యులైనారు కదా గోవిందా… శ్రీ రామ పాదమా నీ కృప జాలునే చిత్తానికి రావే అని త్యాగారజ స్వామి,చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ అని రామదాస స్వామి దాశరధిగా నున్న నీ పదపద్మములను భక్తితో సేవించారయ్యా శ్రీ హరీ! అలాగే కృష్ణం కలయ సఖి సుందరం – బాల అంటూ నారయణ తీర్ధుల వారు శ్రీ కృష్ణునిగా నీ చరణాంబుజములను ఆశ్రయించి తరించారు గదా శ్రీ మన్నారాయణా!



       
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
              

అంటూ పోతానామాత్యుల వారు నీ అవతరాములన్నింటిని తన భాగవత రచన ద్వారా కీర్తించి,నీ పదపద్మములను అర్చించి, పూజించి తరించారు కదా లక్ష్మీవల్లభా!నీకు  శరణాగతులమై నీ చరణములను పూజించడంలో వున్న ఆనందాన్ని,తియ్యదనాన్ని ఆనాటి మాహనుభావులను స్ఫూర్తిగా తీసుకుని ఈనాటి కవులు మాకందిస్తున్నారయ్యా జగన్నాధా!నీ పదముల మహత్యము మరో మారు వెలుగులోకి తీసుకొచ్చిన ఆ పాట నా మదిని నీ వైపు తిప్పినది.

శ్రీ హరి పాదమును తనదైన శైలిలో స్తోత్రం చేసినా ఇక్కడ శివకేశవ అభేదమును పల్లవిలోనే చూపించడం నాకెంతో సంతోషాన్ని కలుగజేసింది.నృత్యానికి అధిదేవత అయిన నటరాజస్వామి మనస్సుకు సంతోషాన్ని కలిగించిన ఈ పాదం సృష్టికే నాట్య వేదమై నిలచి సమస్త ప్రాణకోటిచే వందనములను అందుకుని,కాల చక్ర గమనాన్ని నిర్దేశించే గ్రంధమైనంది.

ఒకనాడు తన కర్తవ్యాన్ని మరిచి గరుత్మంతుని ఆగ్రహానికి గురై యమునా నదిని చేరి ఆపై తన విషముతో కలుషితము చేసి అందరికి అనేక విధములుగా ఇబ్బందులను కలుగ జేసిన కాళియుని శిక్షించి రక్షించిన ప్రభువు మన శ్రీ కృష్ణుడు.అటువంటి స్వామి కాళియుని పడగలపైన ఆనంద తాండవమాడి ప్రజలకు ముదమును,జగత్తుకు శుభమును ప్రసాదించి ఆనందస్వరూపుడయ్యాడు. శ్రీకృష్ణ పాదాలను ధరించినందు వల్లే ఆ మిన్నాగు(పాము) సౌందర్యమూర్తి అయినది.తన సృష్టి అయిన నీటిని అహంభావంతోనో,అఙానంతోనో,నిర్లక్ష్యంతోనో ఏ విధంగానైనా సరే కలుషితం చేస్తే శిక్ష తప్పదని చెప్తున్నారు కదా నా స్వామి.

ప్రహ్లదుని మనవడైన బలి చక్రవర్తి గుణవంతుడు,సౌశీల్యుడు,సంపదలను కలిగినవాడైననూ, తనకున్న దానితో సంతృప్తి పడక అమారవతిపై దండెత్తి..ఇంద్ర పదవిని చేపట్టి దేవతలను అరణ్యపాలు చేసేను. తన సోదర సమానులైన దేవతలను అనేక ఇక్కట్లపాలు చేసినందుకు శిక్షగా తన పాదముతో పాతాళమునకు నేట్టినా,అతని గుణశీలమునకు,భవిష్యత్ మన్వంతరంలో ఇంద్రుని పదవి లభిస్తుందన్న వరమును ఇచ్చినారు కదా..కరుణాపయోనిధి అయిన మహా విష్ణువు .నీవు ఎంత గుణవంతుడవైననూ, నీకున్న దానితో సంతృప్తి పడక,పక్క వానివేమైనా సరే ఇవి నాకు కావాలి అని బలవంతంగా నీకు నీవుగా స్వీకరిస్తే శిక్ష తప్పదని చెప్పారు కదా నా స్వామి .

.వామన మూర్తిగా త్రివిక్రముడవై భూమ్యాకాశాలను వ్యాపిస్తున్న వేళ నీ పాదములను తన కమండలములోని జలముతో కడిగెను కదా సృష్టికర్త.ఆ జలమే నీ పాద స్పర్శతో దేవనదైన గంగమ్మ తల్లిగా వుద్భవించినది.ఆనందస్వరూపుడివి,ఆనంద కారకుడవైన నీ పాదపద్మముల చెంత పుట్టినందువల్లే మా గంగమ్మ తల్లి ఎప్పుడూ సంతోషంతో ఉప్పొంగుతూ వుంటుంది.శ్రీహరీ! నీవు శ్రీరామచంద్రునిగా నున్నప్పుడు నీ పాదధూళిని తాకిన మలయానిలుని స్పర్శ చేత శిలగా నున్న గౌతమి(అహల్య) తిరిగి చైతన్యమూర్తై పతిని చేరుకొని కృతఙ్ఙత నిండిన సంతోషంతో పొంగిపొయింది కదా!మమ్ములను గన్న మా తండ్రీ! సమస్త పాపరాశులను దహించును కదా నీ పాదము.

ఎందరో మహానుభావులు..నిన్ను స్తుతిస్తూ గానం చేసారు,రచనలు చేసారు…వారు గానం చేసే వేళ పాటకు చరణమైనావు…వారి కావ్యాలలో నీవు పదమైనావు.వేద స్వరూపుడివి. వేదానికి ప్రాణమైన నీవు మా గానంలో,కావ్యాలలో నిరంతరం మంగళప్రదుడవు. నిలిచావు.నీ తేజస్సు కలిగిన కావ్యాలు,కీర్తనలు,పాటలు నీ దివ్య సౌందర్యాన్ని సంతరించుకుని శోభిస్తున్నవి.శ్రీవేంకటాచలపతీ!నీ పాదమే సప్తగిరులకు శిఖరమైనది.నీ భక్తుల హృదయాలనే కమలాలలోని భక్తి అనే మకరందాన్ని తాగే తుమ్మెద నీ పాదము.వాగ్గేయకారుల సంగీత,సాహిత్యాలకు నీ పాదమే ఆధారము.త్యాగయ్య  హృదయవేదనను చల్లార్చే శ్రీ గంధము నీ పాదము.అటువంటి నీ చరణాలు అన్నమాచార్యులవారి కృతులలో పదములైనవి.వరదయ్య(క్షేత్రయ్య)నృత్యంలో నాట్య పధమైనవి. శ్రీ తుంబుర నారదాది మునులు,మహర్షులు,ప్రజలు తమ తమ గానంతో,వేదంతో నీ పాదపద్మములను కొలుస్తున్నారు. నిన్ను,నీ పాదపద్మములను ఆశ్రయించిన భాగవతులకు నమస్సుమాంజలులను అర్పిస్తూ,నా హృదయ కుసుమాన్ని నీ చరణాకమలాలకు అర్పిస్తున్నాను తండ్రీ! 
 

kamaneeyapaadam.gif 

“శ్రీ రామ రామ రామేతి రమే రామె మనోరమే,
సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరననే
 
రామ నమ వరనన ఒం నమ ఇతి “
                       

అంటూ విశ్వనాధుడైన పరమశివుడే రామ నామము యొక్క విశిష్టతను మనకు తెలిపి,ఆయన పాద పద్మములే మన అందరికి శరణము అని ఉపదేశించినారు.

“రాముడు రాఘవుడు రవికులు డితడు
భూమిజకు పతియైన పురుష నిధానము”

“రాముడు లోకాభిరాముడందరికి రక్షకు డీతని దెలిసి కొలువరో
కామిత ఫలదుడు చరాచరములకు గర్తయైన సర్వేశ్వరుడితడు “

అంటూ అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలలో శ్రీ రామచంద్రుని గుణగానమును చేసారు…

“జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక”జగముల ఆనందమునకు కారకుడవు,సీతమ్మ తల్లికి ప్రాణ నాధుడవైన నీకు జయము అని రామునకు జయ మంగళములను తన కీర్తనా సుధతో అందిస్తూ మనకు

“రామ కోదండ రామ కల్యాణరామ
రామ సీతాపతి రామ నీవే గతి

అంటూ రామ నామ మహత్యమును తెలిపి శరణాగతి మార్గమును మనకు అందించారు త్యాగరాజ స్వామి.అలాగే భక్త రామదాసు కూడా మరో మారు మనకు చూపించారు.

“శ్రీ రామ నీ నామమేమి రుచిరా
ఓ రామ  నీ నామమెంతో రుచిరా “

“తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
 ప్రక్క తోడుగా భగవంతుడు చక్రధారి అయి చెంతనే యుండగా”

“పాహి రామ ప్రభో పాహి రామ పాభో
పాహి భధ్రాద్రి వైదేహి రామ ప్రభో”

ఇలా తమ సంకీర్తనల ద్వారా శ్రీ రామ నామ మహత్యమును తెలిపి,రామచంద్రుని పాదపద్మములని ఆశ్రయిస్తే  ముక్తి లభిస్తుందని త్యాగరాజ స్వామివారు,భక్త రామదాసు స్వామి వారు తమ తమ జీవితాల ద్వారా,కీర్తనల ద్వారా మనకు తెలియజేసారు. వారు అందజేసిన బాటను గమనించి  మనమూ సీతారాముల పాదపద్మములను ఆశ్రయించి వారి కృపను పొందాలని కవి మనకు సూచిస్తున్నారు.  

గోదారి పొంగింది ఒకనాడు
భద్రాద్రిలో పొంగే సరయూ నదిలా
భవభూతి శ్లోకాల కరుణాకృతిలా
తలుపంత నీవున్న పంచవటి కుటీరాన
బంగారు సీతమ్మ శృంగార రామయ్య
వెలిసారని వేల్పులైనారని

రామయ్య కాళ్ళు కడిగినా
సీతమ్మ కడవ నింపినా
శ్రీ పాదాలే తాకిన క్షీర సాగరంలా
శ్రీ లక్ష్మిని తాకిన మిథిలా కేదారంలా
పొంగీ ఉప్పొంగీ ఆ నింగి గంగతో
ఏకమై పోయింది ఆనాడు
ఎల్లువై పోయింది ఈనాడు

శ్రీ రామ నవమి వచ్చినా,
చైత్రాన కుహువు పాడినా
తూము నరసింహదాస జీవనవాహినిలా,
దాశరథీశతక గానవాఙ్మయ వార్నిధిలా
పొంగీ, ఉప్పొంగీ,
శ్రీరామ చరణమే పల్లవై సాగింది ఆనాడూ..
పాటగా మిగిలిందీ ఈనాడు..

ఈ పాటను ఇక్కడ వినండి ..

గోదావరి నది పొంగిందట ఒకనాడు … శ్రీ రామచంద్రుడు పుట్టినప్పుడు,ఆయన తాటక సంహారం చేసినప్పుడు,విశ్వామిత్రుని యాగ రక్షణ గావించినప్పుడు, ఆ తరువాత శివధనుస్సునెక్కు పెట్టి  జానకిని పరిణయమాడినప్పుడు సరయూ నది ఆనందంతో ఎలా పొంగిందో అలా పొంగిందంట గోదావరి భద్రాద్రిలో.వాల్మీకి మునీంద్రుని శ్లోకాలే కరుణాకృతిగా రూపు దాల్చి ప్రపంచానికి శుభమును జేకూర్చే రామయణమైనది.అటువంటి రామాయణ కావ్యంలా గోదావరి పొంగింది.జీవనదిగా ఎల్ల లోకాలకు  సేవలను అందిస్తున్న ఓ పవిత్ర గోదావరీ! నీ తలపులను తనలో నింపుకున్న పంచవటి కుటీరము పవిత్రతను సంతరించుకుని శోభిస్తున్నది కనుకనే సీతారాములు లక్ష్మణ సమేతులై ఇక్కడ తమ అరణ్య వాసములో కొంత కాలం గడిపినారు..ఆ తరువాత వేల్పులై వెలసి  మన అందరిచేత శాశ్వతముగా పూజలందుకొంటున్నారు.మనకింత భాగ్యమును కలిగించిన సీతారాములు ఎంత కరుణామయులో కదా!

రామయ్య తండ్రి కాళ్ళు కడిగినప్పుడు,సీతమ్మ తల్లి కడవ నింపినప్పుడు,శ్రీ హరి పాదాలను కడిగిన క్షీర సాగరంలా,సీతమ్మ తల్లిగా నున్న శ్రీలక్ష్మిని తాకిన మిథిలా కేదారంలా పొంగి ఉప్పొంగిందంట మా గోదారమ్మ.సీతమ్మ తల్లిని,రామయ్య తండ్రిని సేవిస్తున్నాను అన్న ఆనందంతో … ఆ నింగి గంగతో ఏకమయ్యింది ఒకనాడు …. నదై ప్రవహిస్తోంది ఈనాడు.

                     ఈ చరణంలో శ్రీమహావిష్ణువుని పాదాలను కడిగినప్పుడు క్షీర సాగరం ఎలా అనందంతో పొంగిందో..రామయ్య తండ్రి పాదాలను కడిగినప్పుడు గోదారమ్మ తల్లి అలానే  పొంగిపొయింది అని చెప్పినప్పుడు నా మనస్సుకు చందనం పూసినట్ళయ్యింది. అలాగే జనక రాజపుత్రిగా నున్న శ్రీలక్ష్మీని తాకి,అమ్మ కృపతో ధన ధాన్యాలతో,సకల సౌభాగ్యాలతో మిథిల ఎలా అనందంతో శోభను సంతరించుకుందో,అంత ఆనందంగా మన సీతమ్మ తల్లి కడవను నింపుతోంది గోదావరి అని కవి చెప్తున్నప్పుడు నేనే గోదవరై రామయ్య కాళ్ళు కడిగినట్లు,సీతమ్మ కడవ నింపినట్లు అన్న భావన నాలో కలుగుజేసింది.అందుకే ఈ పాట అంటే నాకు అంత ఇష్టము.భగీరథుని కోరిక మేర త్రిపధగా ప్రవహించిన గంగ ఏ సముద్రంలోకి వెళ్ళి కలసిందో ,అలా గోదావరీ మాత సీతారాములను సేవించుకుని  సముద్రంలోకి తాను కూడా కలిసి ఆ గంగతో  ఏకమయైపోయింది ఆనాడు..జీవనదిగా మన అందరికీ సేవలను అందిస్తూ సీతారాముల కృపను పొందింది ఈనాడు అని కవి అంటున్నప్పుడు మనసు పరవశంతో కేరింతలు కొడుతూ ఆ గోదావరి తల్లికి వందనములిడుతుంది..

చైత్ర మాసాన శ్రీ రామనవమి వచ్చినప్పుడు,కోకిలలు తమ కుహు కుహు గీతాలతో సీతమ్మ తల్లికి,రామయ్య తండ్రికి సంతోషం పెట్టినప్పుడు ,జీవనదిలా సాగే తూమూ నరసింహదాస కీర్తనలలా,రామదాసుల వారి గానవాఙ్మయ వార్నిధిలా(వార్నిధి = వార్+నిధి (వార్ = నీరు. వారుణాస్త్రం, వరుణుడు ..మొదలైన పదాలకి ‘వార్ ‘ ధాతువే మూలం.) = సముద్రము)
ఆనందంతో ఉప్పొంగిపోయిందంట గౌతమి. శ్రీ రామచంద్రుని చరణములకు  తమ కీర్తనలను అంకితం చేసారు ఆనాటి శ్రీరామదాసు,తూము నరసింహదాసు గారు..వారి కీర్తనలు జీవనదిలా ఈనాటికి మన అందరి హృదయాలలో నిలిచి వున్నాయి..

for more information:

http://www.andhrabharati.com/kIrtanalu/tUmu/tUmu_narasiMhadAsu_intro.html

sivakesava.gif

కొలువై వున్నాడే దేవ దేవుడు! 

ఆహా! సంగీత నాట్యాలకు ప్రధాన నిలయంగా వున్న ఈ పాట వింటున్నపుడల్లా పరవశించి పోతూండేదాన్ని.నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ పాట. అయితే సాహితీ పరంగా అర్ధాన్ని నేను ఇదివరకు ఎప్పుడూ పట్టించుకొనలేదు.ఒకవేళ పట్టించుకున్నా  ఆ పాట పూర్తిగా అర్ధం కాక,సగ సగం అర్ధమయ్యి నిరాశపడుతూ సతమతమవుతూ వుండేదాన్ని.అయితే నా ఆరాధ్య దైవమైన శ్రీహరిని ఎంత అందంగా స్తుతిస్తున్నారని అనిపిస్తూ వుండేది  ఆ పాటలో ఉన్న  దేవదేవుడు,వనిత మొహనాంగుడు,పాలుగారు మోము,నలవేలు వంటి విశేషణములను చూసి.కాని అదే సమయంలో మరి కొన్ని విశేషణములైన వలరాజు పగవాడూ,కులవంక నెలవంక,పులి తోలు గట్టి వంటి వాటిని పరిశీలిస్తే పరమశివుని స్తుతిస్తున్నట్లుగా కనిపించింది.ఏది ఏమైనా ఇందులో హరిహర అద్వైతం దాగి వుందని భావించి  ఈ పాటను సాహితీ పరంగా పూర్తిగా  అర్ధంచేసుకోవలన్న సంకల్పంతో నాకు స్ఫురించిన భావాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.మీకిక్కడ ఏమైనా తప్పులు కనిపిస్తే సహృదయంతో మన్నించి సరిదిద్దగలరు.ఈ పాట నృత్యానికి సంబందించినది కాబట్టి నాట్యానికి సంబంధించిన శ్లోకంతో,మొదలవుతుంది.

అయితే ఈ పాట గురించి మరింత వివరణ ఇచ్చేముందు మరి  కొన్ని విషయాలను ఇక్కడ చెప్పదలుచుకున్నాను.ఈ పాటకు అర్ధంతో పాటు కవి హృదయాన్ని కూడా తెలుసుకోవాలనుకున్నాను.ఈ పాటలో ప్రతి పదంలో ప్రతి వాక్యంలో నాకు శివకేశవుల అద్వైతం కనపడింది.కాని చివర రెండు పంక్తుల దగ్గరకు వచ్చేసరికి కవిగారు సదాశివుని స్తుతిస్తూ రాశారని అర్ధమైనది..కాని నాకు ఈ పాటలో మొదట్నుంచీ హరిహరుల తత్వం కనపడింది మరి ఈ పంక్తులలో కనపడలేదేమిటా అని అనుకున్న సమయంలో ఆ శ్రీమహవిష్ణువే నాకు సమాధానాన్ని ఇచ్చాడు అనిపించింది.అయితే నేను చెప్పదలుచుకున్న మరో విషయం ఏమిటంతే ఈ పాటలో వున్న కొన్ని పదాలకి అర్ధాలు నాకు అవగతం కాలేదు…అందుకే వాటీని విడగొట్టి అర్ధాన్ని వెతుకవలసి వచ్చింది.ఈ ప్రయత్నము ఆ దైవ కృప వలన సఫలమైందని అనుకుంటున్నాను.. ఈ పాటకు అర్ధాన్ని తెలుసుకోవాలి అన్న నా తపన,అందుకోసం పడ్డ కష్టం,అలాగే తాత్పర్యం రాయడానికి స్నేహితులు అందించిన సహాయసహకారాలు నాకెంతో సంతోషాన్ని,ఆత్మ సంతృప్తిని కలిగించాయి.

కంఠేన్(అ)ఆలంబయేత్ గీతం
హస్తేన అర్థం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

గీతం అన్నది కంఠమే ఆలంబనగా ఉంటుంది,హస్తాలు అర్థాన్ని ప్రదర్శిస్తాయి,కళ్ళు భావాన్ని చూపుతాయి,పాదాలు తాళానికి అణుగుణంగా ఆడతాయి అన్న ఈ శ్లోకం మనకు అంటే సామాన్య మానవునకు నాట్య శాస్త్రం లోని సారంశాన్ని  అతనికి అర్ధమయ్యే రీతిలో చెపుతుంది.శాస్త్రీయ నృత్యం గురించొ చెప్పే ఈ శ్లోకాన్ని తనదైన శైలిలో మనందరికి  పరిచయం చేసిన ఘనత మన కాశినాధుని విశ్వనాథ్ గారికే దక్కుతుంది.

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకనములమర
నలువంకల మణిరు చులవంక కనరా

తలవంక నలవేలు
తలవంక నలవేలు
కులవంక నెలవంక
తలవంక నలవేలు
కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ

మేలుగరతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
మేలుగరంతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కెయు రాలు నెరయంగ
పాలు గారు మోమున శ్రీను పొడమా
పాలు గారు మోమున శ్రీను పొడమా
పులి తోలు గట్టి ముమ్మోన వాలు బట్టి తెరగా

శివ తత్వము:

విశ్వనాధుడైన మహాదేవుడు దేవ దేవుడై కోటి  సుర్యుల తేజస్సుకు సమానముగా ప్రకాశిస్తూ కోలువై వున్నాడు ..వలపులకు రాజు అయిన మన్మధునికి పగవాడై … వనిత అనే మోహనమైన అంగము కలిగినవాడు(పర్వతి దేవిని తన అంగముగా చేసుకుని అర్ధనారీశ్వరుడైనాడు.)

వివిధ రకాలైన సర్పములను నీ ఆభరణాలుగా జేసుకున్న పరమశివా …. నాలుగు దిక్కులా తమ మణులకాంతిని ప్రసరిస్తూ వెలుగును నింపుతున్న నాగరాజములను కరుణతో జూడవయ్యా!లేక ఇలా కూడా అర్ధం చేసుకోవచ్చని  నాకు అనిపించింది.. వివిధ రకాలైన సర్పములను నీ ఆభరణాలుగా జేసుకునా పరమశివా …. కైలాసా శిఖరానికి నాలు వైపులా రక్షకులుగా వున్న నాగేశ్వరులని కాంచవయ్యా ఆని…మణిరుచులు అన్నదానికి మణులంటే  ఎంతో ప్రియము కలిగి వాటినే  అభరణాలుగా చేసుకుని ధరించిన  పాములు అని అర్ధమును కూడ తీసుకోవచ్చు అని భావిస్తున్నాను.

నీ తలపైన నీ జటాజూటములనే కమలమున కూర్చుని వున్నది కదా గంగా భవాని!ఆ జటాజూటముల చెంతనే వుంది కదా  నెలవంక..ప్రేమతో వారిని నీ శిరోభూషణములుగా అలంకరించుకుని మరింత రమణీయముగా శోభిస్తున్నావు.నీ శిరస్సుకు భూషణాలుగా వున్న  నెలవంక,గంగా భవానీలు కూడ మరింత సౌందర్యాన్ని సంతరించుకుని లోకాలను రక్షిస్తున్నారు.

మంచి మేలిమైన రత్నపుటుంగరాలు వంటి జటాజూటములతో ,భుజమునకు వున్న పన్నగ కేయురములతో (పాములను భుజ కీర్తులుగా జేసుకున్న)నీవు శోభిస్తూ వుండగా నీ పాలుగారు మోమున వున్న శ్రీకారం ఎల్ల లోకాలను శాసిస్తూ వుండగా పులి తోలు గట్టి త్రిశులపాణీవై పార్వతీ దేవితో కైలాసాన చిద్విలాసముగా కొలువున్న నీకు నా శిరస్సును వంచి వందనములను అర్పిస్తున్నాను.

విష్ణు తత్వము:

జగన్నాధుడైన శ్రీమన్నారాయణుడు దేవ దేవుడై ,కోటి సూర్యుల తేజస్సుతో సమానముగా ప్రకాశిస్తూ కొలువై వున్నాడు.శ్రీ హరి రూప సౌందర్యం ,హృదయ సౌందర్యం విశ్వమంతటా వ్యాపిస్తోంది .. స్త్రీ జన మనస్సులలో నిశ్చలంగా నిలిచి తన హృదయస్థానమున శ్రీదేవిని నిలిపి  వనిత మోహనాంగుడై  మన్మధునికి పగవాడైనాడు.  

చేతులకు సరిగ్గా సరిపోయే కంకణములు ధరించిన స్త్రీలు నీ చుట్టూ వున్నారు…వారిపై నీ చల్లని చూపుల చంద్రకిరణాల కాంతిని ప్రసరించరా! మణిరుచులంటే ఇక్కడ..మణులాది ఐశ్వర్యములు అంటే ఇష్టము కలిగిన ఆడువారు అన్న అర్ధము కూడా వస్తుందని  భావిస్తున్నాను.

ఓ శ్రీ హరీ! నీ తల వైపున శేషుడు ఛత్రమై నిను సేవిస్తున్నాడు.చంద్రసహోదరి అయిన శ్రీదేవి నీకు సతి అయి నీ పాదపద్మములను సేవిస్తున్నది..ఇలా నీ మీదనున్న ప్రేమతో నిను జేరి సేవిస్తున్నారు కదా శ్రీ మహలక్ష్మి దేవి,ఆదిశేషువు.అలాగే నీవు కూడ వారి పట్ల అత్యంత ప్రేమను స్నేహమును చూపుతున్నావు.

మేలిమైన రత్నపుటుంగరాలతో ,భుజాలకు సువర్ణ కేయూరములతో (భుజకీర్తులతో)నీవు శోభిస్తూ వుండగా,పాలు గారే నీ మోమునున్న శ్రీకరం  ఎల్ల లోకాలను శాసిస్తూ వుండగా,చిద్విలాసముతో జీవాత్మలకు అంటిపెట్టుక్కున్న అహంకారమనే  పులి తోలును శంఖ చక్ర గదాయుధుడవై నీ చాకచక్యముతో తీసివేసే ఓ లక్ష్మీనారయణా! నీకు నా శిరసాభివందనములు..  (ఇక్కడ గట్టి అనే పదానికి చాక చక్యము,గట్టితనము,తెలివి వంటి అర్ధాలు కూడా వున్నవి..) 

 

A few references

1.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=vanka&display=simple&table=brown
2.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=kulamu&display=simple&table=brown
3.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=alamu&display=simple&table=brown
4.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=nalamu&display=simple&table=brown
5.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=velu&display=simple&table=brown
6.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=puli&display=simple&table=brown
7.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=gatti&display=simple&table=brown

8.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=bhujaga&display=simple&table=brown

 

 

My Special Thanks to

 

 

kiran charkaravartula garu,Lalitha Sravanthi,Amritavarshini 

 

 

స్వరధార

srisaraswati03.jpg

ఘంటసాల గారి గంధర్వగానంలో వెలువడిన ఒక స్వరపుష్పం.ఘంటసాల గారి గానమాధుర్యములో ఈ పద్యం ప్రాచుర్యానికి నోచుకోనిదైనా శారదా దేవి కరుణకు పాత్రమైనది.

http://www.esnips.com/doc/f4b2642a-5852-4f32-ab07-980a6ec5cd4c/Vagardha-(-Slokam)

పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య;

jasmine.jpg 

ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు
పూలిమ్మని రేమ్మ రేమ్మకు
యెంత తొందరలే హరి పూజకు

ఫ్రొద్దుపొడవక ముందె పూలిమ్మని

కొలువయితివా దేవి నా కోసము !!2!!
తులసీ..తులసీ దయా పూర్ణ తలచి
మల్లెలివి నా తల్లి వరలక్ష్మి కి!!2!!

మొల్లలివి నన్నేలు నా స్వామికి

యేలీల సేవింతు యేమనసు కీర్తింతు!!2!!
సీతమనసే నీకు సింహాసనం

ఒక పూవ్వు పాదాల ఒక దివ్వె నీ వ్రాలా!!2!!
ఒదిగి నీయేదుట …ఇదే వందనం ఇదే వందనం.

ఈ పాట వింటున్నప్పుడల్లా నా మనస్సు మలయానిలము తాకిన అనుభూతి చెందుతుంది.శృతి చేసిన వీణపై హిందోళం రాగం పలికించినప్పుడు కలిగే మధుర భావం నా హృదయం అంతా నిండి పరవశం కలుగుతుంది.ఈ పాట మనస్సుకు మైమరపే కాదు బుద్ధికి ఆలోచనను కూడా  కలిగిస్తుంది…అది ఎలాగంటారా?ఆ విషయానికే వస్తున్నాను.

                     సూర్యోదయం కాకమునుపే వృక్షాలు,మొక్కలు అంతా నిద్రలేస్తాయి. తొలి సంధ్య వేళ కల్లా హరి పూజకు పూలిస్తాయి.ఒక్క చెట్లేనా ఊహు!పశు పక్ష్యాదులు కూడా మేల్కొని భానోదయం కాక మునుపే మెల్కోని తమకు తోచిన రీతిలో ఆ పరమాత్మునికి,ఆయన సృష్టిలో భాగమైన మనను సేవిస్తాయి..ఒక్క మాటలో చెప్పాలంటే మనకన్న ముందరే తెల్లవారుఝామునే ప్రకృతిలొని జీవకోటి(ఒక్క మనుష్యులు తప్ప) అంతా మేల్కొని తమ తమ విద్యుక్తధర్మాలను నిర్వహిస్తాయి.మనమేమో బారెడు పొద్దెక్కినా లేవము ఒక వేళ లేచినా ప్రొద్దున్నే చెయ్యవలసిన కార్యక్రమములు చెయ్యము(శుచిగా తయారవ్వడం,దైవారధనకు కనీసం ఐదు నిముషాలు అన్న వెచ్చించకపోవడం మొదలైనవి).అంటే మనకన్న పశువులే నయమని మనం ఒప్పుకుని చూపిస్తున్నాం కదా ప్రపంచానికి.తెల్లవారకముందే నిద్రలేచి హరి పూజకై కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు పూలిస్తున్నవు,ఎంత భాగ్యశాలివమ్మ నీవు అని వృక్షదేవతను కొనియాడుతూనే, ప్రొద్దుటే నిద్రలేవని మనలను సున్నితంగా మందలిస్తున్నారు కవి.                          

              లక్ష్మీ అంశతోనున్న తులసి శ్రీహరికి అత్యంత ప్రియము.శ్రీమన్నారయణునికి ప్రియమైన తులసీ దయాంతరంగురాలవై నా కోసం మా ఇంట వెలిసినావా…విష్ణుహృత్కమలవాసిని అయిన శ్రీ వరలక్ష్మీ ఇదిగో నీ ప్రీతికై మల్లెపూలు తెచ్చాను.నన్నేలు నా స్వామి కోసం మొల్లలు పెట్టుకుంటున్నాను.ఆహా!కృష్ణ శాస్త్రి గారి హృదయం ఎంత రసభరితము కాకపోతే ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా ఇక్కడ భక్తి,శృంగార రసాలు ఒకేసారి గుప్పించగలిగారు..                                                                

               శ్రీ రామచంద్రా!నిన్నే విధంగా సేవించను?ఏ విధంగా కీర్తించను?మీమేంత చేసినా అది నీకు తక్కువే కదా!సీతమ్మ తల్లి నిన్న ప్రేమించినంతగా,ఆరాధించినంతగా ఎవ్వరూ నిన్ను ప్రేమించి ఆరాధించి ఉండరు కదా!అందుకే మా అమ్మ సీత మనసే నీకు సింహాసనమైనది.ఒక పువ్వు నీ దగ్గర ఎలా శరణమంటుందో,ఒక దీపం తన తుది జీవిత క్షణం వరకు ఏ ప్రతిఫలాపేక్ష  లేకుండా ఎలా సేవించుకుంటుందో అలా నీ శరణు గోరి,చేరి సేవించుకుంటాను.అందుకు ముందుగా నా వందనములు అందుకోవయ్యా!

పాత టపాలు »

Follow

Get every new post delivered to your Inbox.